Original bilingual journalism · English & తెలుగు
ఉత్తరాంధ్రకు ఆరెంజ్ అలర్ట్.. 18కల్లా తీవ్ర తుపాను సూచన
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు గురువారం (నవంబరు 19) ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. బంగాళాఖాతంలోని అల్పపీడనం నవంబరు 18 ఉదయానికి తీవ్ర తుపానుగా బలపడొచ్చని ఐఎండీ అంచనా వేసింది.

ఉత్తరాంధ్రలో నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో గురువారం (నవంబరు 19) అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అమరావతి వాతావరణ కేంద్రం శనివారం మధ్యాహ్నం ఈ హెచ్చరిక ఇచ్చింది. శుక్రవారం నాటి అంచనాలో ఇవి ఎల్లో అలర్ట్‌లోనే ఉన్నాయి.
గురువారం ఉదయం 8.30 నుంచి 24 గంటల పాటు హెచ్చరిక అమల్లో ఉంటుంది. బుధవారం నుంచి శుక్రవారం వరకు ఈ జిల్లాల్లో గంటకు 40-50 కి.మీ. వేగంతో, గరిష్ఠంగా 60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు యానాంకు గురువారం భారీ వర్షాలకు ఎల్లో అలర్ట్ ఉంది.
బుధవారం (నవంబరు 18) ఉదయం 8.30 వరకు ఏ జిల్లాకూ హెచ్చరిక లేదు. ఆ తర్వాత శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలు మొదలవుతాయని అంచనా. శుక్రవారం (నవంబరు 20) ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాలతో పాటు కాకినాడ, యానాంలోనూ భారీ వర్ష సూచన ఉంది. రాయలసీమలోని ఎనిమిది జిల్లాలకు ఏడు రోజులూ హెచ్చరిక లేదు.
బుధవారానికి తీవ్ర తుపాను
బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం గమనాన్ని ఐఎండీ శనివారం మధ్యాహ్నం 1.30కి విడుదల చేసిన బులెటిన్‌లో వివరించింది. ఆదివారం (నవంబరు 15) ఉదయం 5.30కల్లా ఇది వాయుగుండంగా మారొచ్చు. సోమవారం (నవంబరు 16) ఉదయానికి తీవ్ర వాయుగుండంగా, అదే రోజు సాయంత్రం 5.30కల్లా తుపానుగా బలపడొచ్చు. బుధవారం ఉదయం 5.30కల్లా తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. అప్పుడు గంటకు 75-85 కి.మీ. వేగంతో, గరిష్ఠంగా 95 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయి.
ఎక్కువ వాతావరణ నమూనాలు ఇది ఉత్తరాంధ్ర తీరం వైపు కదులుతుందని చూపుతున్నాయి. తర్వాతి గమనం, బలం, తీరం దాటే చోటుపై వాటి మధ్య పెద్ద తేడాలున్నాయి. ఐఎండీ జీఎఫ్‌ఎస్ నమూనా మాత్రం మయన్మార్ వైపు చూపుతోంది. తీరం ఎక్కడ దాటుతుందో ఐఎండీ ఇంకా ప్రకటించలేదు.
సాయంత్రం 4.33కి విడుదలైన ఐఎండీ జాతీయ బులెటిన్ ప్రకారం కోస్తాంధ్ర, యానాంలో 19న అక్కడక్కడ అతి భారీ వర్షాలు, 18, 20 తేదీల్లో భారీ వర్షాలు పడొచ్చు. గురువారం గంటకు 50-60 కి.మీ. వేగంతో, గరిష్ఠంగా 70 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయి.
మత్స్యకారులు వెనక్కి.. తెలంగాణలో జల్లులు
సముద్రంలో ఉన్న మత్స్యకారులు ఆదివారంలోగా తీరానికి చేరుకోవాలని అమరావతి కేంద్రం మధ్యాహ్నం 1.30 హెచ్చరికలో సూచించింది. 17, 18 తేదీల్లో తీరం వెంబడి గంటకు 55-65 కి.మీ. వేగంతో, గరిష్ఠంగా 75 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.
శుక్రవారం అంచనాల్లో పొడి వాతావరణమే ఉన్న తెలంగాణలోనూ వానలు పడే అవకాశం ఉంది. నవంబరు 19 ఉదయం నుంచి 21 ఉదయం వరకు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో జల్లులు కురవొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శనివారం సాయంత్రం 5.30 బులెటిన్‌లో తెలిపింది. రాష్ట్రానికి ఎలాంటి హెచ్చరికా జారీ చేయలేదు.
More Stories
Andhra Pradeshఏపీ, తెలంగాణ చెరో రూ.1,000 కోట్ల రుణం.. 17న వేలం
Andhra Pradeshపుర ఎన్నికల రెండో విడత.. 23 చోట్ల నామినేషన్లు ప్రారంభం
Andhra Pradeshపంచాయతీ ఎన్నికల తొలి విడత.. 15 నుంచి నామినేషన్లు
Andhra Pradesh16కల్లా తుపానుగా అల్పపీడనం.. ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన
Andhra Pradeshతిరుచానూరు బ్రహ్మోత్సవాలకు ముస్తాబు.. నవంబరు 20లోగా రథం పనులు
Andhra Pradeshసీఐఐ సదస్సులో రూ.1,41,585 కోట్ల ఒప్పందాలు.. పెనుకొండలో కియా ప్లాంటు
