Original bilingual journalism · English & తెలుగు
ఏకగ్రీవ పంచాయతీలకు రూ.50 లక్షల వరకు నజరానా
సర్పంచితో పాటు వార్డు సభ్యులందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకునే పంచాయతీలకు ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం పెంచింది. జనాభాను బట్టి రూ.15 లక్షలు, రూ.25 లక్షలు, రూ.50 లక్షలు అందుతాయి.

పంచాయతీ ఎన్నికల వేళ పల్లెలకు ప్రభుత్వం నజరానా ప్రకటించింది. ఏకగ్రీవ పంచాయతీలకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని పెంచింది. సర్పంచితో పాటు వార్డు సభ్యులందరూ పోటీ లేకుండా ఎన్నికైన పల్లెలకు జనాభాను బట్టి గరిష్ఠంగా రూ.50 లక్షలు అందుతాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ శుక్రవారం (నవంబరు 13) జీవో ఆర్‌టీ నం.1111 జారీ చేసింది. తొలి విడత ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం అదే రోజు నోటిఫికేషన్ ఇచ్చింది.
ఇప్పటివరకు 2020 మార్చిలో ఇచ్చిన జీవో నం.157 ప్రకారం నాలుగు శ్లాబుల్లో ప్రోత్సాహకం ఇచ్చేవారు. 2,000 లోపు జనాభా ఉన్న పంచాయతీకి రూ.5 లక్షలు దక్కేవి. 2,001 నుంచి 5,000 జనాభా ఉంటే రూ.10 లక్షలు వచ్చేవి. ఇప్పుడు ఈ రెండింటినీ ఒకే శ్లాబుగా మార్చారు. 5,000 వరకు జనాభా ఉన్న ఏ పంచాయతీకైనా రూ.15 లక్షలు ఇస్తారు. అంటే 2,000 లోపు జనాభా ఉన్న పల్లెలకు నజరానా మూడు రెట్లయింది.
5,001 నుంచి 10,000 జనాభా ఉన్న పంచాయతీలకు నజరానా రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెరిగింది. 10,000 దాటిన పంచాయతీలకు రూ.20 లక్షల బదులు రూ.50 లక్షలు అందుతాయి. ఇది పాత మొత్తానికి రెండున్నర రెట్లు. గ్రామాల్లో వర్గపోరు, ఎన్నికల వివాదాలు తగ్గించి ఏకాభిప్రాయం పెంచడమే లక్ష్యమని శాఖ జీవోలో పేర్కొంది. ఆర్థిక శాఖ అదే రోజు ఆమోదం తెలిపింది.
అభివృద్ధి పనులకే నిధులు
ఎన్నికల అధికారులు ఏకగ్రీవమని అధికారికంగా ప్రకటించిన పంచాయతీలకే ఈ నజరానా వర్తిస్తుంది. అర్హతను ధ్రువీకరించాకే నిధులు విడుదల చేస్తారు. ఈ నిధులను ఆమోదించిన అభివృద్ధి, ప్రజా సంక్షేమ పనులకే ఖర్చు చేయాలి. ఆర్థిక, లెక్కలు, ఆడిట్ నిబంధనలు వర్తిస్తాయి. పాలకవర్గం పదవీకాలంలో విడతలవారీగా చెల్లిస్తారు.
పోటీ చేసే హక్కుకు, ఓటర్ల స్వేచ్ఛకు ఈ పథకం అడ్డు కాకూడదని జీవో స్పష్టం చేసింది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే పేరిట జీవో విడుదలైంది. కలెక్టర్ల ద్వారా పథకంపై విస్తృత ప్రచారం చేయాలని పంచాయతీరాజ్ కమిషనర్‌ను ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియ ముగిశాక అర్హత పొందిన పంచాయతీల సంఖ్య, అయ్యే వ్యయం అంచనా పంపాలని సూచించింది. పెంచిన మొత్తాలు 2026 ఎన్నికలకే వర్తిస్తాయి.
నవంబరు 15 నుంచి నామినేషన్లు
తొలి విడతలో 3,967 సర్పంచి, 40,012 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరుగుతాయి. రిటర్నింగ్ అధికారులు నవంబరు 15న ఎన్నికల నోటీసు ఇస్తారు. 17వ తేదీ వరకు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 18న పరిశీలన ఉంటుంది. 21న మధ్యాహ్నం 3 గంటలతో ఉపసంహరణ గడువు ముగుస్తుంది. అదే రోజు తుది జాబితా వెలువడుతుంది. పోటీ ఉన్నచోట 26న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. పూర్తి షెడ్యూలు ఇక్కడ చూడవచ్చు.
మూడు విడతల్లో కలిపి 13,167 సర్పంచి, 1,31,862 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడతకు నవంబరు 16న నోటిఫికేషన్ వెలువడుతుంది. 29న పోలింగ్ ఉంటుంది. మూడో విడతకు 19న నోటిఫికేషన్ ఇస్తారు. డిసెంబరు 2న పోలింగ్ జరుగుతుంది.
More Stories
Andhra Pradeshఏపీ, తెలంగాణ చెరో రూ.1,000 కోట్ల రుణం.. 17న వేలం
Andhra Pradeshపుర ఎన్నికల రెండో విడత.. 23 చోట్ల నామినేషన్లు ప్రారంభం
Andhra Pradeshపంచాయతీ ఎన్నికల తొలి విడత.. 15 నుంచి నామినేషన్లు
Andhra Pradesh16కల్లా తుపానుగా అల్పపీడనం.. ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన
Andhra Pradeshతిరుచానూరు బ్రహ్మోత్సవాలకు ముస్తాబు.. నవంబరు 20లోగా రథం పనులు
Andhra Pradeshసీఐఐ సదస్సులో రూ.1,41,585 కోట్ల ఒప్పందాలు.. పెనుకొండలో కియా ప్లాంటు
