Original bilingual journalism · English & తెలుగు
మరో 500 గిగావాట్ల స్వచ్ఛ విద్యుత్: రానున్న 10-11 ఏళ్లలో సాధిస్తామన్న ప్రధాని మోదీ
దిల్లీలో పునరుత్పాదక ఇంధన సదస్సును ప్రారంభించిన ప్రధాని, దేశంలో ఇప్పటికే దాదాపు 300 గిగావాట్ల శిలాజేతర సామర్థ్యం ఉందని, ఇక మరో 500 గిగావాట్లే లక్ష్యమని చెప్పారు.

దేశానికి కొత్త స్వచ్ఛ విద్యుత్ లక్ష్యాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 2 సోమవారం ప్రకటించారు. రానున్న 10 నుంచి 11 ఏళ్లలో మరో 500 గిగావాట్ల కొత్త శిలాజేతర విద్యుత్ సామర్థ్యాన్ని జోడిస్తామని చెప్పారు. దిల్లీలోని భారత్ మండపంలో భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్ & ఎక్స్‌పో 2026ను ఆయన ప్రారంభించారు. “లక్ష్యం కొంచెం కష్టమే. కానీ నా దేశ సామర్థ్యంపై నాకు నమ్మకం ఉంది. సాధించి తీరుతాం” అని మోదీ అన్నారు.
నాలుగు రోజుల ఈ సదస్సు నవంబర్ 5 వరకు సాగుతుంది. అంతర్జాతీయ సౌర కూటమి తొమ్మిదో అసెంబ్లీ, హరిత హైడ్రోజన్‌పై నాలుగో అంతర్జాతీయ సదస్సు కూడా దీనితో కలిసి జరుగుతున్నాయి.
ఇప్పటిదాకా ఎంత?
2030 నాటికి 500 గిగావాట్ల శిలాజేతర సామర్థ్యం సాధిస్తామని 2021 కాప్-26 వాతావరణ సదస్సులో భారత్ మాట ఇచ్చింది. అందులో దాదాపు 300 గిగావాట్లు ఇప్పటికే సిద్ధమయ్యాయని ప్రధాని తెలిపారు. మొత్తం స్థాపిత సామర్థ్యంలో సగం శిలాజేతర వనరుల నుంచే రావాలన్న పారిస్ హామీని 2025లోనే, గడువుకు ఐదేళ్ల ముందే అందుకున్నామన్నారు.
పశ్చిమాసియా సంక్షోభం ఇంధన భద్రతకూ ఆర్థిక భద్రతకూ మధ్య ఉన్న ముడిని బయటపెట్టిందని మోదీ అన్నారు. శిలాజ ఇంధనాలపైనే ఆధారపడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పదే పదే కుదుపులకు గురవుతుందని హెచ్చరించారు. గత పదేళ్లలో ఈ రంగంలోకి రూ.15 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని, 2024 రీ–ఇన్వెస్ట్ సదస్సు తర్వాతి రెండేళ్లలోనే దాదాపు రూ.6 లక్షల కోట్లు వచ్చాయని చెప్పారు. ఈ దశాబ్దం ముగిసేలోగా రూ.20 లక్షల కోట్లకు మించిన అవకాశాలు ఉన్నాయన్నారు.
ఇంటి పైకప్పు నుంచి పొలం గట్టు దాకా
పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన 2024 ఫిబ్రవరిలో కోటి ఇళ్ల లక్ష్యంతో మొదలైంది. ఇప్పటికి 65 లక్షలకు పైగా కుటుంబాలు చేరాయని, వారి కరెంటు బిల్లులు సుమారు 76 శాతం తగ్గాయని ఒక అధ్యయనాన్ని ప్రధాని ఉటంకించారు. కుసుమ్ పథకంతో 30 లక్షలకు పైగా రైతులకు సౌర సాగునీరు అందుతోంది. 44 వేలకు పైగా ప్రభుత్వ భవనాలపై సోలార్‌తో ఏటా దాదాపు రూ.700 కోట్లు ఆదా అవుతున్నాయి. పదేళ్ల కిందట 2 గిగావాట్లుగా ఉన్న సోలార్ మాడ్యూళ్ల తయారీ సామర్థ్యం ఇప్పుడు 200 గిగావాట్లు దాటింది.
రైతులు ఖాళీ భూముల్లో, పొలం గట్ల వెంట ప్యానెళ్లు పెట్టాలని మోదీ సూచించారు. పైకప్పు సౌర విద్యుత్‌తో వంట, విద్యుత్ వాహనాల చార్జింగ్‌కు నమూనాలు తయారు చేయాలని స్టార్టప్‌లు, ఐఐటీలను కోరారు.
More Stories
Nationalతేని జైలు నుంచి 17 మంది రిమాండ్ ఖైదీల పరారీ: ఫిట్స్ వచ్చాయని నాటకమాడి గార్డులపై దాడి; నలుగురు పట్టుబడ్డారు, 13 మంది కోసం వేట
Nationalఖర్గే “మోదీ కా బాప్” వ్యాఖ్య: దేశవ్యాప్తంగా బీజేపీ నిరసనలు, హైదరాబాద్‌లోనూ ఆందోళన; క్షమాపణకు డిమాండ్
Nationalఅమిత్ షాపై వ్యాఖ్యల కేసు: రాహుల్ గాంధీని నిర్దోషిగా ప్రకటించిన సుల్తాన్‌పూర్ కోర్టు
Nationalఐరోపా నగరాల్లో వేసవి వేడికి 50 వేల మందికి పైగా మృతి: తాజా అధ్యయనం
Nationalనేహా బోరా పిటిషన్ కొట్టివేత: నోటీసు రద్దుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరణ, పత్రాలివ్వాలని మేజిస్ట్రేట్‌కు ఆదేశం
Nationalముడి చక్కెర సుంకం రహిత దిగుమతికి డిసెంబర్ 31 వరకు గడువు; ఉత్పత్తి అంచనా 306 లక్షల టన్నులకు కోత