Original bilingual journalism · English & తెలుగు
ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మరో ఐదేళ్లు: 2031 వరకు కొనసాగింపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం, 779 నుంచి 850కి పెంపు
అత్యాచారం, పోక్సో కేసుల విచారణకు ఉద్దేశించిన ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టుల పథకాన్ని 2031 మార్చి 31 వరకు కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకు రూ.3,788.04 కోట్లు ఖర్చు చేస్తారు.

అత్యాచారం, చిన్నారులపై లైంగిక నేరాల కేసులను త్వరగా తేల్చేందుకు ఏర్పాటైన ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మరో ఐదేళ్లు పని చేయనున్నాయి. ఈ పథకాన్ని 2026 ఏప్రిల్ 1 నుంచి 2031 మార్చి 31 వరకు కొనసాగించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నవంబర్ 4 బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు.
పథకానికి మొత్తం రూ.3,788.04 కోట్లు ఖర్చవుతుంది. ఇందులో కేంద్రం వాటా రూ.2,353.15 కోట్లు. ఈ మొత్తాన్ని నిర్భయ నిధి నుంచి ఇస్తారు. మిగిలిన రూ.1,434.89 కోట్లను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు భరిస్తాయి.
కొత్తగా 71 కోర్టులు
దేశంలో ఇప్పుడు 779 ప్రత్యేక కోర్టులు నడుస్తున్నాయి. వీటిని 850కి పెంచుతారు. పెండింగ్ కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాలకు కొత్త కోర్టులు దక్కుతాయి. ప్రతి కోర్టులో ఒక న్యాయాధికారి, ఒక ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఆరుగురు సిబ్బంది ఉంటారు. బాధిత పిల్లలు బెదురు లేకుండా సాక్ష్యం చెప్పేందుకు ప్రత్యేక గదులు కూడా ఏర్పాటు చేస్తారు. 2019 అక్టోబర్ 2న మొదలైన ఈ కోర్టుల్లో ఇప్పటివరకు 4.02 లక్షలకు పైగా కేసులు పరిష్కారమయ్యాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని?
కేంద్ర న్యాయ శాఖ జూలై 24న లోక్‌సభకు ఇచ్చిన వివరాల ప్రకారం 2026 ఏప్రిల్ 30 నాటికి తెలంగాణలో 36 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పని చేస్తున్నాయి. వీటిలో పోక్సో కేసులకే పరిమితమైన కోర్టు ఒక్కటీ లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని 16 కోర్టులూ పూర్తిగా పోక్సో కేసులనే విచారిస్తున్నాయి. కోర్టుల పనితీరును కేంద్ర న్యాయ విభాగం ఆన్లైన్ డ్యాష్‌బోర్డు ద్వారా పర్యవేక్షిస్తుంది. హైకోర్టులు, రాష్ట్ర ప్రభుత్వాలతో సమీక్షలు కూడా జరుపుతుంది.
More Stories
Jobs & Educationనీట్ పీజీలో పర్సంటైల్‌కు స్వస్తి? ర్యాంకులే ప్రకటించే విధానానికి ఎన్ఎంసీ సూత్రప్రాయ ఆమోదం
Nationalసోమాలియా తీరంలో హైజాక్ అయిన ఇరాన్ పడవ ‘అజిని’ని విడిపించిన భారత నౌకాదళం; 20 మంది సిబ్బంది క్షేమం
Nationalమరో 500 గిగావాట్ల స్వచ్ఛ విద్యుత్: రానున్న 10-11 ఏళ్లలో సాధిస్తామన్న ప్రధాని మోదీ
Nationalగిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులకు జాతీయ సామాజిక భద్రత బోర్డు: కేంద్ర కార్మిక శాఖ నోటిఫికేషన్; ఛైర్మన్‌గా కార్మిక మంత్రి
Nationalగువాహటి హోటల్లో కాల్పులు, ఐదుగురు మృతి: యజమాని, ఆమె కుమారుడు సహా మృతులు; గంటలోనే లీజుదారు అరెస్ట్
Nationalతేని జైలు నుంచి 17 మంది రిమాండ్ ఖైదీల పరారీ: ఫిట్స్ వచ్చాయని నాటకమాడి గార్డులపై దాడి; నలుగురు పట్టుబడ్డారు, 13 మంది కోసం వేట