Original bilingual journalism · English & తెలుగు
వృద్ధులకు తోడుగా ‘వయో సాథీ’.. వాలంటీర్ల నమోదు ప్రారంభం
వృద్ధులకు తోడుగా నిలిచే ‘వయో సాథీ’ వాలంటీర్ల నమోదును కేంద్రం ప్రారంభించింది. 18 ఏళ్లు నిండిన ఎవరైనా పోర్టల్‌లో లేదా ‘జీవన్’ యాప్‌లో పేరు నమోదు చేసుకోవచ్చు.

దిల్లీ: వృద్ధులకు తోడుగా నిలవాలనుకునే వారికి కేంద్రం ఒక వేదిక తెచ్చింది. ‘వయో సాథీ’ వాలంటీర్లుగా పేర్లు నమోదు చేసుకోవాలని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ మంగళవారం (నవంబరు 10) పౌరులను కోరింది. 18 ఏళ్లు నిండిన ఎవరైనా ఇందుకు అర్హులే. తరాల మధ్య అనుబంధం పెంచేందుకు నవంబరు 4న దిల్లీలో మొదలైన జాతీయ ప్రచారంలో ఇది ఒక భాగం.
నమోదు ఇలా
మంత్రిత్వ శాఖ వృద్ధుల సంక్షేమ పోర్టల్ seniorcitizen.dosje.gov.in/vayo-sathi లో గానీ, ‘జీవన్’ మొబైల్ యాప్‌లో గానీ నమోదు చేసుకోవచ్చు. దరఖాస్తులో పూర్తి పేరు, పుట్టిన తేదీ, లింగం, విద్యార్హత, చిరునామా, పిన్‌కోడ్, రాష్ట్రం, జిల్లా, ఫోన్ నంబరు ఇవ్వాలి. ఆ నంబరుకు వచ్చే ఓటీపీతో ధ్రువీకరణ పూర్తవుతుంది. ఈ–మెయిల్ తప్పనిసరి కాదు. రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి. నమోదుకు చివరి తేదీ ఏదీ ప్రకటించలేదు. పాల్గొన్న వారికి ‘వయో సాథీ’ ధ్రువపత్రం ఇస్తామని మంత్రిత్వ శాఖ తెలిపింది.
వాలంటీర్లు ఏం చేస్తారు
ఆంగ్లంలో ‘సాథీ’ పేరులోని ఆరు అక్షరాలు సహకారం, అవగాహన, సాయం, శిక్షణ, ఆరోగ్యం, సమ్మిళితం అనే మాటలకు సంకేతాలు. వాలంటీర్లు వృద్ధులకు స్నేహితుల్లా, వారధుల్లా ఉంటారు. డిజిటల్ సేవలు వాడుకోవడం నేర్పుతారు. సంక్షేమ పథకాలు, స్థానికంగా దొరికే సాయం గురించి చెబుతారు. సైబర్ మోసాలపై అప్రమత్తం చేస్తారు. కళాశాల విద్యార్థులు, ఉద్యోగులు, స్థానిక స్వచ్ఛంద కార్యకర్తలు ఎవరైనా చేరవచ్చని మంత్రిత్వ శాఖ పేర్కొంది. పెద్దవాళ్లతో కాసేపు కూర్చోవడం, తెలిసిన నైపుణ్యం నేర్పడం లాంటి చిన్న పనులూ ఇందులో భాగమే.
‘వయో సమ్మాన్ రాష్ట్రీయ అభియాన్’ పేరుతో సాగే ప్రచారంలో ఈ వాలంటీర్లది ఒక పాత్ర. ‘అటల్ వయో అభ్యుదయ యోజన’ కింద కేంద్ర మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ నవంబరు 4న దీన్ని ప్రారంభించారు. కలవడం, మాట్లాడుకోవడం, కలిసి సృష్టించడం, తోడ్పడటం, కొనసాగించడం అనే ఐదు దశల ‘5సీ’ నమూనాలో ఇది నడుస్తుంది. ‘కలిసి 30 నిమిషాలు’, ‘నా కథ, నా భారత్’, ‘డిజిటల్ దాదా–దాదీ / డిజిటల్ సాథీ’ సహా 12 అంశాలున్నాయి. రాష్ట్రాలు, జిల్లాలు, స్థానిక సంస్థలు ఏం చేయాలో వివరించే కరదీపికనూ విడుదల చేశారు.
దేశంలో 60 ఏళ్లు పైబడిన వారు 2011లో సుమారు 10 కోట్ల మంది. 2036 నాటికి ఈ సంఖ్య 23 కోట్లకు చేరుతుందని ప్రారంభ కార్యక్రమంలో మంత్రి చెప్పారు. వలసలు, పట్టణీకరణ, కుటుంబ వ్యవస్థలో మార్పుల వల్ల తరాల మధ్య రోజువారీ కలయిక తగ్గిందన్నారు. విద్యాసంస్థలు, పంచాయతీలు, ఇతర స్థానిక సంస్థలు, సామాజిక సంఘాల ద్వారా గ్రామాలకూ, పట్టణ కాలనీలకూ ప్రచారాన్ని తీసుకెళ్లాలని మంత్రిత్వ శాఖ భావిస్తోంది. సాయం అవసరమైన వృద్ధులు టోల్‌ఫ్రీ నంబరు 14567కు ఫోన్ చేయవచ్చు. ఈ జాతీయ హెల్ప్‌లైన్ వారంలో ఏడు రోజులూ పనిచేస్తుంది.
More Stories
Nationalక్యాన్సర్ మందుల ధరలు తగ్గాయి.. రూ.713 మాత్రలు ఇక రూ.25
Nationalనవంబరు 11న స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు.. గతసారి ఏపీకి ఐదు
Nationalలోక్ అదాలత్‌లో తెలంగాణ 10.09 లక్షలు, ఏపీ 4.33 లక్షల కేసులు పరిష్కారం
Nationalబస్తర్‌లో మోదీ దీపావళి: నక్సలిజం లేని తొలి దీపావళి అన్న ప్రధాని; తెలంగాణలో 6, ఏపీలో 5 జిల్లాలు 2025 నాటికే జాబితా నుంచి బయటకు
NationalE20 petrol: 893 samples అన్నీ సరిగ్గానే ఉన్నాయన్న కేంద్రం; Karnataka 26-31% ethanol వాదనపై అభ్యంతరం
Nationalముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు పోయినవారికి మరో అవకాశం: మళ్లీ enumeration form; తెలంగాణలో నవంబర్ 21 వరకు గడువు
