Original bilingual journalism · English & తెలుగు
పాఠశాలల్లోనే 12వ తరగతి.. వచ్చే ఏడాది నుంచి
నర్సరీ నుంచి 12వ తరగతి వరకు మూడు దశల విధానం రానుంది. పదో తరగతి తర్వాత పదో తరగతి తర్వాత చదువు మానేస్తున్నవారే ఈ మార్పుకు కారణమని సీఎం తెలిపారు.

హైదరాబాద్: రాష్ట్రంలో బడి చదువు ఇకపై పదో తరగతితో ఆగదు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 12వ తరగతి వరకు పాఠశాల విధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం (నవంబరు 11) ఎంసీఆర్ హెచ్ఆర్డీ సంస్థలో విద్యాశాఖపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు.
కొత్త విధానంలో మూడు దశలు ఉంటాయి. నర్సరీ నుంచి 4వ తరగతి వరకు ప్రాథమిక విద్య. 5 నుంచి 8 వరకు సెకండరీ. 9 నుంచి 12 వరకు సీనియర్ సెకండరీ. ప్రస్తుతం పదో తరగతి తర్వాత విద్యార్థులు రెండేళ్ల ఇంటర్ కోసం జూనియర్ కళాశాలలకు వెళ్తున్నారు.
ఎందుకీ మార్పు
పదో తరగతి తర్వాత చాలామంది చదువు మానేస్తున్నారని సీఎం అన్నారు. వీరిలో బాలికలు, దళిత, గిరిజన, మైనారిటీ పిల్లలే ఎక్కువని పేర్కొన్నారు. 12వ తరగతి వరకు నడిచే కేంద్రీయ, నవోదయ, కస్తూర్బా విద్యాలయాల్లో బడి మానేసేవారు చాలా తక్కువని గుర్తు చేశారు. దేశంలో 18 రాష్ట్రాలు ఇదే విధానం పాటిస్తున్నాయని తెలిపారు.
ఇంటర్‌ను పాఠశాల విద్యలో కలిపే ప్రతిపాదనను మే 10న ప్రభుత్వం వాయిదా వేసింది. శాసనసభలో చర్చ తర్వాతే తుది నిర్ణయం అని అప్పట్లో సీఎం చెప్పారు. ఆ చర్చ జరిగిందా లేదా అన్నది తాజా ప్రకటనలో లేదు.
మీకు ఏం మారుతుంది
ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఏ మార్పూ లేదు. 9, 10 తరగతులు, ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థుల కుటుంబాలు అధికారిక ఉత్తర్వుల కోసం చూడాలి. మార్పు ఎలా జరుగుతుందో ప్రకటనలో లేదు. బోర్డు పరీక్షలు, ప్రవేశాలు, ఫీజులపైనా వివరాలు లేవు. జూనియర్ కళాశాలల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది ఉద్యోగ, పదవీ విరమణ ప్రయోజనాలకు ఇబ్బంది ఉండదని సీఎం హామీ ఇచ్చారు.
సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు అద్దె భవనాల్లో ఉండకూడదని ఆదేశించారు. సొంత భవనాలకు కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. యంగ్ ఇండియా సమీకృత గురుకులాల పనులు వేగవంతం చేయాలన్నారు. విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ల నియామకాలు నిబంధనల ప్రకారం త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
More Stories
Telanganaమూసీ పునరుజ్జీవానికి అనుమతులన్నీ.. త్వరలో టెండర్లు
Telanganaరెండు నెలల్లో పాతబస్తీ మెట్రో పనులు.. ఏడాదిలో మీరాలం కొత్త రూపు
Telanganaతెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు రిజిస్ట్రేషన్లు.. సందర్శకులకూ అవకాశం
Andhra Pradesh13న బంగాళాఖాతంలో అల్పపీడనం సూచన.. 14 నుంచి సీమలో జల్లులు
Telanganaకరవు మండలాల్లో పంట రుణాల రీషెడ్యూల్.. బ్యాంకులకు భట్టి సూచన
Telanganaరాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల లోపే.. 29 జిల్లాల్లో పెరగనున్న చలి
