Original bilingual journalism · English & తెలుగు
కియా రెండో ప్లాంటు.. 2030 ఆరంభంలో ఉత్పత్తి
ఏపీలో కియా రెండో ప్లాంటు 2030 ఆరంభంలో ఉత్పత్తి మొదలుపెడుతుంది. ఏటా 2 లక్షల వాహనాల సామర్థ్యం ఉండే ఈ ప్లాంటుకు కియా, దాని సరఫరా సంస్థలు కలిసి 2 బిలియన్ డాలర్లు పెడుతుండగా, సుమారు 12,000 మందికి ఉపాధి దొరుకుతుంది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కియా రెండో ప్లాంటు 2030 ఆరంభంలో ఉత్పత్తి మొదలుపెడుతుంది. దాని సామర్థ్యం ఏటా 2 లక్షల వాహనాలు. ఈ వివరాలను కియా ఇండియా వెల్లడించింది. విశాఖపట్నంలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో గురువారం (నవంబరు 12) రాష్ట్ర ప్రభుత్వంతో సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
కొత్త ప్లాంటుపై కియా, దాని విడిభాగాల సరఫరా సంస్థలు కలిసి 2 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడతాయి. సరఫరా సంస్థల స్థలంతో కలిపి ప్లాంటు 465 ఎకరాల్లో ఉంటుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 12,000 మందికి ఉపాధి దొరుకుతుందని సంస్థ అంచనా. ప్రస్తుత ప్లాంటులాగే ఇక్కడా స్టాంపింగ్, వెల్డింగ్, పెయింటింగ్, అసెంబ్లింగ్ పనులు జరుగుతాయి. సంప్రదాయ ఇంధనంతో, విద్యుత్‌తో నడిచే కొత్త మోడళ్లు ఇక్కడ తయారవుతాయి.
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో రూ.19,000 కోట్లతో కియా మరో ప్లాంటు పెడుతోందని ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం రాత్రి ప్రకటించింది. 12,000 ఉద్యోగాలు వస్తాయని తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, కియా ఇండియా ఎండీ, సీఈవో గ్వాంగు లీ సమక్షంలో ఒప్పందం కుదిరింది. కియా ప్రకటనలో రూపాయల లెక్క లేదు. ఆ సంస్థ ప్రకటించిన 2 బిలియన్ డాలర్లలో సరఫరా సంస్థల పెట్టుబడీ కలిసే ఉంది.
రెండు ప్లాంట్లు.. పోలిక ఇదీ
రెండు ప్లాంట్ల వివరాలను కియా ఒక పట్టికలో ఇచ్చింది. రెండింటి చిరునామానూ అనంతపురం అనే పేర్కొంది. ప్రస్తుత ప్లాంటును సంస్థ మొదటి నుంచీ అనంతపురం ప్లాంటుగానే పిలుస్తోంది. ఆ ప్లాంటు కూడా పెనుకొండలోనే ఉంది. దాని సామర్థ్యం ఏటా 4,30,000 వాహనాలు. సరఫరా సంస్థలతో కలిపి అది 945 ఎకరాల్లో ఉంది. కియా, సరఫరా సంస్థలు కలిపి దానిపై పెట్టిన తొలి పెట్టుబడి 2.9 బిలియన్ డాలర్లు. దానివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 24,237 మందికి ఉపాధి లభిస్తోంది. రెండో ప్లాంటు వస్తే మొత్తం సామర్థ్యం 6 లక్షల వాహనాలు దాటుతుంది. రెండు ప్లాంట్లపై పెట్టుబడి 5 బిలియన్ డాలర్ల వరకు చేరుతుంది.
ప్రస్తుత ప్లాంటులో సెల్టోస్, సోనెట్, సైరోస్, కేరెన్స్, కేరెన్స్ క్లావిస్, కార్నివాల్, సొరెంటో కార్లు తయారవుతున్నాయి. వీటిలో సంప్రదాయ ఇంధన, విద్యుత్, సీఎన్‌జీ, హైబ్రిడ్ రకాలు ఉన్నాయి. ‘‘కియా దీర్ఘకాలిక వృద్ధి లక్ష్యాలకు భారత్ కేంద్ర బిందువు’’ అని గ్వాంగు లీ అన్నారు. కొత్త ప్లాంటుతో గిరాకీకి తగ్గట్టు వాహనాలను వేగంగా అందించగలుగుతామని తెలిపారు.
రికార్డు అమ్మకాల తర్వాత..
ఒప్పందానికి 11 రోజుల ముందు నవంబరు 1న కియా ఇండియా రికార్డు అమ్మకాల వివరాలు వెల్లడించింది. 2026 అక్టోబరులో 33,462 వాహనాలను డీలర్లకు పంపింది. 2025 అక్టోబరులో పంపిన 29,556 కంటే ఇవి 13.22% ఎక్కువ. సంస్థ చరిత్రలో ఇదే అత్యధికం. జనవరి నుంచి అక్టోబరు వరకు టోకు అమ్మకాలు 2,86,470కు చేరాయి. 2025లో ఏడాది మొత్తం అమ్మకాలు 2,80,286. పది నెలల్లోనే సంస్థ ఆ సంఖ్యను దాటేసింది.
కొత్త ప్లాంటు నిర్మాణం ఎప్పుడు మొదలవుతుందో కియా ప్రకటనలో లేదు. 2030 ఆరంభంలో ఉత్పత్తి ప్రారంభమవుతుందని మాత్రమే పేర్కొంది.
More Stories
Andhra Pradeshమత్స్యకారులు 20 వరకు వేటకు వెళ్లొద్దు
Andhra Pradeshమూడు పారిశ్రామిక నగరాలు.. రూ.31,360 కోట్ల పెట్టుబడుల అవకాశం
Andhra Pradeshముస్తాక్ అలీ ట్రోఫీ.. హిమాచల్ చేతిలో ఆంధ్ర ఓటమి
Andhra Pradeshపంచాయతీ రెండో విడత.. శ్రీకాకుళంలో అత్యధిక స్థానాలు
Andhra Pradeshతీవ్ర వాయుగుండం.. 20న నెల్లూరు-తుని మధ్య తీరం దాటే అవకాశం
Andhra Pradeshప్రకాశం రైతుబిడ్డ.. 600 చిత్రాల గిరిబాబు ఇకలేరు
