ప్రధాన కంటెంట్‌కు వెళ్లండి

2029లో ఛాంపియన్స్‌ ట్రోఫీ.. 2031లో ప్రపంచకప్‌ భారత్‌లోనే

2035 వరకు జరిగే పురుషుల ఐసీసీ టోర్నీల తేదీలు ఖరారయ్యాయి. 2029 అక్టోబరులో ఛాంపియన్స్‌ ట్రోఫీకి భారత్‌ ఆతిథ్యమిస్తుంది. 2031 ప్రపంచకప్‌ను బంగ్లాదేశ్‌తో కలిసి నిర్వహిస్తుంది.

చెట్ల మధ్య తెల్లని పైకప్పుతో ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియం, వెనుక హైదరాబాద్‌ భవనాలు

మూడేళ్ల వ్యవధిలో రెండు ఐసీసీ టోర్నీలు భారత్‌లో జరగనున్నాయి. 2029 అక్టోబరు 9 నుంచి 28 వరకు ఛాంపియన్స్‌ ట్రోఫీ ఉంటుంది. 2031 అక్టోబరు 9 నుంచి నవంబరు 23 వరకు 50 ఓవర్ల వన్డే ప్రపంచకప్‌ జరుగుతుంది. దీన్ని బంగ్లాదేశ్‌తో కలిసి నిర్వహిస్తారు. ఇండోనేసియాలోని బాలిలో సమావేశమైన ఐసీసీ బోర్డు 2035 వరకు పురుషుల టోర్నీల క్యాలెండర్‌ను ఆమోదించింది. ఆదివారం (నవంబరు 15) దాన్ని విడుదల చేసింది.

వన్డే ప్రపంచకప్‌, టీ20 ప్రపంచకప్‌, ఛాంపియన్స్‌ ట్రోఫీ, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌.. ఈ నాలుగు టోర్నీలు ఇందులో ఉన్నాయి. 2028 అక్టోబరు 12 నుంచి నవంబరు 12 వరకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో టీ20 ప్రపంచకప్‌తో ఇది మొదలవుతుంది. 2035 ప్రపంచకప్‌తో ముగుస్తుంది. అది అక్టోబరు 2 నుంచి నవంబరు 18 వరకు ఉంటుంది. ఆతిథ్య దేశాన్ని ఇంకా ఖరారు చేయలేదు.

ఏ టోర్నీ ఎక్కడ

2030 టీ20 ప్రపంచకప్‌ జులై 4 నుంచి ఆగస్టు 4 వరకు ఇంగ్లాండ్‌, ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌లో జరుగుతుంది. టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ 2029లో జూన్‌ 8-12, 2031లో జూన్‌ 12-16 తేదీల్లో ఇంగ్లాండ్‌లోనే. 2032, 2034 టీ20 ప్రపంచకప్‌లు, 2033 ఛాంపియన్స్‌ ట్రోఫీ, 2033, 2035 టెస్టు ఫైనళ్లకు వేదికలు తేలాల్సి ఉంది. భారత్‌లో ఏ నగరాల్లో మ్యాచ్‌లు జరుగుతాయో ఐసీసీ ఇంకా చెప్పలేదు.

తేదీలు ముందే ఖరారైతే ఆటగాళ్లు, సభ్య బోర్డులు ప్రణాళిక వేసుకోవచ్చని ఐసీసీ సీఈవో సంజోగ్‌ గుప్తా తెలిపారు. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌, ఛాంపియన్స్‌ ట్రోఫీ భారత్‌ వద్దే ఉన్నాయి. వన్డే ప్రపంచకప్‌ ఆస్ట్రేలియా దగ్గర, టెస్టు గద దక్షిణాఫ్రికా దగ్గర ఉన్నాయి.

ఒలింపిక్స్‌కు అర్హత పోటీలు

లాస్‌ ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌లో 128 ఏళ్ల తర్వాత క్రికెట్‌ తిరిగి అడుగుపెడుతోంది. ఇందుకు చివరి అర్హత టోర్నీల తేదీలనూ ఐసీసీ ప్రకటించింది. పురుషుల టోర్నీ 2028 ఫిబ్రవరి 5 నుంచి 13 వరకు బంగ్లాదేశ్‌లో జరుగుతుంది. మహిళల టోర్నీ ఫిబ్రవరి 26 నుంచి మార్చి 5 వరకు అమెరికాలో ఉంటుంది. ఒక్కో టోర్నీలో 8 జట్లు ఆడతాయి. నాలుగేసి జట్లతో రెండు గ్రూపులు, మొత్తం 13 మ్యాచ్‌లు ఉంటాయి. ఫైనల్‌ గెలిచిన జట్టుకే ఒలింపిక్‌ బెర్తు. ఒలింపిక్స్‌లో ఒక్కో విభాగంలో 6 జట్లు పతకాల కోసం తలపడతాయి.

ఆసియాలో అగ్రస్థానంలో నిలిచిన భారత మహిళల జట్టు ఇప్పటికే అర్హత సాధించింది. గ్రేట్‌ బ్రిటన్‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా కూడా తమ ప్రాంతాల నుంచి చోటు దక్కించుకున్నాయి. అంతకంటే ముందు 2027 వన్డే ప్రపంచకప్‌ దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలో జరుగుతుంది.

ప్రతీకాత్మక చిత్రం: హైదరాబాద్‌ ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం. ఫొటో: ఐమహేశ్‌ / సీసీ బై-ఎస్‌ఏ 4.0, వికీమీడియా కామన్స్‌ ద్వారా

The Scope Briefing, in your inbox

Five stories that matter, every morning — curated and verified by our editors.