Original bilingual journalism · English & తెలుగు
మాంచెస్టర్‌లో శ్రీరామాలయానికి సొంత భవనం.. కొనుగోలు పూర్తి
బ్రిటన్‌లోని మాంచెస్టర్‌లో శ్రీరామాలయం కోసం భవనం కొనుగోలు నవంబరు 17న పూర్తయిందని జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ యూకే (జెట్‌యూకే) ప్రకటించింది. ఆలయం కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌నూ ప్రారంభించింది.

బ్రిటన్‌లోని మాంచెస్టర్‌లో శ్రీరామాలయం ఏర్పాటు దిశగా కీలక అడుగు పడింది. ఆలయం కోసం ఎంచుకున్న భవనం కొనుగోలు మంగళవారం (2026 నవంబరు 17) పూర్తయిందని జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ యూకే (జెట్‌యూకే) ప్రకటించింది. ఇది చరిత్రాత్మక ఘట్టమని పేర్కొంది.
ఈ ప్రయత్నానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ భక్తులకు పంపిన సందేశంలో జెట్‌యూకే బృందం కృతజ్ఞతలు తెలిపింది. శ్రీరామాలయం కోసం ప్రత్యేక వెబ్‌సైట్ (ramalayam.org.uk)ను కూడా ప్రారంభించింది. ఆలయ ఘన ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నామని, తాజా సమాచారం కోసం వెబ్‌సైట్‌లో వార్తాలేఖకు నమోదు చేసుకోవాలని భక్తులను కోరింది.
ఐదు నెలల్లోపే కొనుగోలు
ఆలయ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం.. ఈ భవనాన్ని 2026 జూన్ 30న గుర్తించారు. జులై 6న తొలిసారి చూశారు. జులై 12న ట్రస్టు బోర్డు సమావేశమైంది. తొలుత 5.6 లక్షల పౌండ్లుగా ఉన్న ఆఫర్‌ను 6.7 లక్షల పౌండ్లకు, ఆగస్టు 6న తుది ఆఫర్‌గా 6.85 లక్షల పౌండ్లకు పెంచారు. ఆగస్టు 18న ఆ ఆఫర్‌కు ఆమోదం లభించింది. ఆగస్టు 25న విక్రయ నిబంధనలు వచ్చాయి. ఆగస్టు 26న న్యాయ ప్రక్రియను సొలిసిటర్లకు అప్పగించారు. నవంబరు 17న ఒప్పంద పత్రాల మార్పిడి జరిగి, విక్రయం పూర్తయింది.
నిధుల సేకరణ కూడా సమాంతరంగా సాగింది. మాంచెస్టర్‌లోని ట్రాఫర్డ్ ప్రాంతంలో భవనాన్ని గుర్తించామని, 4 లక్షల పౌండ్లు సమకూరాయని, మరో 2.85 లక్షల పౌండ్లు కావాలని ఆగస్టు 18న జెట్‌యూకే తెలిపింది. రెండు వారాల్లో లక్ష పౌండ్లు అందాయని సెప్టెంబరు 4న, కొనుగోలుకు అవసరమైన నిధులు సమకూరాయని సెప్టెంబరు 28న వెల్లడించింది. ఈ భవనానికి ఇప్పటికే ప్రార్థనా స్థలం లైసెన్సు ఉందని, వెంటనే వినియోగించుకునే స్థితిలో ఉందని ట్రస్టు పేర్కొంది. కొత్త వెబ్‌సైట్‌లో ఆలయ చిరునామాను ట్రినిటీ రోడ్, సేల్, మాంచెస్టర్‌గా పేర్కొన్నారు.
ఆలయంలో ఏముంటాయంటే..
శ్రీవైష్ణవ సంప్రదాయంలో, శ్రీరాముడి రూపంలో శ్రీమన్నారాయణుడిని ఆరాధించే కేంద్రంగా శ్రీరామాలయాన్ని తీర్చిదిద్దుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రీరామ పరివారమే ప్రధాన దేవతలని పేర్కొన్నారు. శ్రీ భూ సమేత శ్రీనివాస పెరుమాళ్, శ్రీ గోదా కృష్ణ, శ్రీ లక్ష్మీ హయగ్రీవ మూర్తుల వివరాలూ వెబ్‌సైట్‌లో ఉన్నాయి. పూజలే కాకుండా పవిత్ర గ్రంథాలు, సంప్రదాయాలు, చరిత్రను తెలుసుకునేందుకు ఒక గ్రంథాలయం, కుటుంబాలు కలిసే వేదిక, పిల్లలకు మన కథలు, విలువలు, వారసత్వాన్ని నేర్పే కేంద్రంగానూ దీన్ని తీర్చిదిద్దాలన్నది లక్ష్యమని వివరించారు. శ్రీ చిన్నజీయర్ స్వామి మార్గదర్శకత్వమే ఈ ప్రయత్నానికి స్ఫూర్తి అని వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.
ఐదేళ్లు పైబడిన పిల్లల కోసం ప్రతి ఆదివారం ‘ప్రజ్ఞ‘ విలువల కార్యక్రమం, నెలవారీ సత్సంగాలు, యోగా తరగతులు, యువజన క్లబ్ వంటి కార్యక్రమాల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. 220 మంది వరకు పట్టే కమ్యూనిటీ హాల్ సహా పలు గదులను అద్దెకు ఇచ్చే సదుపాయం ఉందని తెలిపారు. 2027 జనవరి 15న శ్రీ గోదా రంగనాథ కల్యాణం, జనవరి 16న మకర సంక్రాంతి వేడుకలు కార్యక్రమాల జాబితాలో ఉన్నాయి.
ప్రారంభోత్సవ తేదీ ఇంకా ఖరారు కాలేదు
ఆలయ ప్రారంభోత్సవ తేదీని నిర్వాహకులు ఇంకా ప్రకటించలేదు. భవనానికి కొత్త హంగులు, ఆలయ ప్రారంభం, మొదటి దశ పూర్తి.. ఇవే తదుపరి లక్ష్యాలని, వాటి తేదీలను తర్వాత ప్రకటిస్తామని వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. ఆలయ నవీకరణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. పనుల పురోగతి తెలుసుకోవడం, వార్తాలేఖకు నమోదు, స్వచ్ఛంద సేవకులుగా పేర్లు ఇవ్వడం, ఆలయ అభివృద్ధికి విరాళాలు అందించడం.. ఇవన్నీ వెబ్‌సైట్ ద్వారానే చేయవచ్చు.
జెట్‌యూకే నేపథ్యం
2009 నవంబరులో శ్రీ చిన్నజీయర్ స్వామి బ్రిటన్‌లో పర్యటించినప్పుడు.. వేదాలు, ఉపనిషత్తుల బోధనలను ప్రచారం చేసేందుకు, సమాజ సేవకు ఒక వేదిక కావాలని అక్కడి భక్తులు కోరారు. ఆ విజ్ఞప్తి మేరకు జెట్‌యూకే ఏర్పడిందని ట్రస్టు తెలిపింది. 2011 జనవరి 16న ఇది రిజిస్టర్డ్ స్వచ్ఛంద సంస్థగా నమోదైంది (నంబరు 1139951). విద్య, సేవ, ప్రాచీన జ్ఞానం అనే మూడు మూలస్తంభాలపై ఈ సంస్థ పనిచేస్తోంది. భగవద్గీత, సంస్కృతం, వేద విద్య తరగతులు నిర్వహిస్తోంది. అంధులు, పేదల విద్య, ఆరోగ్య కార్యక్రమాలు, గోసంరక్షణ వంటి సేవలకు చేయూతనిస్తోంది. పండగలు, సత్సంగాలు జరుపుతోంది. నార్విచ్‌లోని టన్‌స్టాల్‌లో ఈ ట్రస్టుకు ఇప్పటికే ఒక ఆలయం ఉంది.
ఆధారం: జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ యూకే, శ్రీరామాలయం వెబ్‌సైట్ www.ramalayam.org.uk.
More Stories
Internationalఇండియానాలో డిసెంబరు 5న భారత కాన్సులర్ శిబిరం
Internationalఅబుదాబిలో భారత రాయబార కార్యాలయం ‘ఓపెన్ హౌస్’.. 27న
Internationalమనీలా ఖల్సా దివాన్ గురుద్వారా పునర్నిర్మాణానికి మోదీ శంకుస్థాపన
Internationalఅమెరికా, ఆస్ట్రేలియాల్లో భారత కాన్సులర్ శిబిరాలు
Internationalబ్రిటన్‌లో శాశ్వత నివాసం.. పదేళ్ల నిరీక్షణ
Internationalమనీలాలో ప్రవాసులను కలవనున్న మోదీ.. ఫిలిప్పీన్స్‌లో 9,800 మంది భారత విద్యార్థులు
