Original bilingual journalism · English & తెలుగు
డిసెంబరు 4 నుంచి జేఎన్టీయూహెచ్ పీహెచ్డీ ప్రవేశ పరీక్ష
జేఎన్టీయూహెచ్ పీహెచ్డీ ప్రవేశ పరీక్ష డిసెంబరు 4, 5, 6 తేదీల్లో జరగనుంది. నవంబరు 25 నుంచి హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయి.

హైదరాబాద్: జేఎన్టీయూహెచ్ పీహెచ్డీ ప్రవేశ పరీక్ష డిసెంబరు 4, 5, 6 తేదీల్లో జరగనుంది. 2026-27 విద్యా సంవత్సరం ప్రవేశాలకు ఈ పరీక్షను కంప్యూటర్ ఆధారితంగా నిర్వహిస్తారు. అభ్యర్థులు నవంబరు 25 నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వర్సిటీ ప్రవేశాల సంచాలకులు నవంబరు 13న షెడ్యూలు, సూచనలు విడుదల చేశారు.
రోజూ రెండు విడతలుగా పరీక్ష ఉంటుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మొదటి విడత. మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు రెండో విడత. మొత్తం 16 సబ్జెక్టులకు ఆరు విడతల్లో పరీక్ష జరుగుతుంది.
ఏ రోజు ఏ సబ్జెక్టు
తొలి రోజు శుక్రవారం (డిసెంబరు 4) ఉదయం మేనేజ్మెంట్ సైన్స్, ఫార్మాస్యూటికల్ సైన్సెస్, కెమిస్ట్రీ పరీక్షలు ఉంటాయి. మధ్యాహ్నం బయోటెక్నాలజీ, మెటలర్జికల్ ఇంజినీరింగ్, వాటర్ రిసోర్సెస్ పరీక్షలు జరుగుతాయి. డిసెంబరు 5న ఉదయం సివిల్ ఇంజినీరింగ్, గణితం, ఫిజిక్స్, నానో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటాయి. అదే రోజు మధ్యాహ్నం ఈసీఈ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరీక్షలు నిర్వహిస్తారు. డిసెంబరు 6న ఉదయం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఒక్కదానికే పరీక్ష. మధ్యాహ్నం కెమికల్, ఈఈఈ, మెకానికల్ ఇంజినీరింగ్‌తో పరీక్షలు ముగుస్తాయి.
నెట్, గేట్ ఉంటే మినహాయింపు
ఎక్స్టర్నల్ పీహెచ్డీ, అనుబంధ కళాశాలల పరిశోధన కేంద్రాల్లో ఫుల్‌టైం పీహెచ్డీ, జేఆర్ఎఫ్, వర్సిటీ ఫెలోషిప్ పొందినవారి ఫుల్‌టైం పీహెచ్డీ, పారిశ్రామిక ఉద్యోగుల ఎక్స్టర్నల్ పీహెచ్డీ.. ఈ నాలుగు విభాగాలకు ఈ ప్రకటన వర్తిస్తుంది. పరీక్షకు అర్హుల జాబితాను www.jntuh.ac.in, www.doa.jntuh.ac.in వెబ్సైట్లలో చూసుకోవాలని వర్సిటీ సూచించింది.
యూజీసీ–నెట్, యూజీసీ–సీఎస్ఐఆర్-నెట్, స్లెట్‌లో అర్హత సాధించినవారు ప్రవేశ పరీక్ష రాయనక్కర్లేదు. చెల్లుబాటయ్యే గేట్, జీప్యాట్ స్కోరు ఉన్నవారికి, ఎంఫిల్ చేసినవారికీ ఇదే మినహాయింపు వర్తిస్తుంది. ఇతర అర్హత నిబంధనలు మాత్రం పాటించాలి. వీరి ధ్రువపత్రాల పరిశీలన తేదీలను త్వరలో ప్రకటిస్తామని వర్సిటీ తెలిపింది. పారిశ్రామిక ఉద్యోగులకు, యూజీసీ, సీఎస్ఐఆర్, డీఎస్టీ ఇన్స్పైర్ వంటి జాతీయ పరీక్షల ద్వారా ఫెలోషిప్ పొందినవారికి పరిశీలన, ఇంటర్వ్యూ తేదీలు విడిగా వెలువడతాయి.
హాల్‌టికెట్లు doaphd.jntuh.ac.in/registration/download-hallticket లింకులో లభిస్తాయి. పరీక్ష రోజు సంతకం చేసిన హామీ పత్రాన్ని ఇన్విజిలేటర్‌కు ఇవ్వాలి. దరఖాస్తులో ఇచ్చిన వివరాలు తప్పని తేలితే ప్రవేశం ఎప్పుడైనా రద్దవుతుందని ఆ పత్రంలో స్పష్టం చేశారు. ఇంటర్వ్యూకు అసలు ధ్రువపత్రాలు తీసుకురావాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రం నకలు జత చేయాలి. దివ్యాంగులు వైద్య బోర్డు ఇచ్చిన ధ్రువపత్రం నకలు ఇవ్వాలి. విశ్వేశ్వరయ్య పీహెచ్డీ పథకం కింద ఫుల్‌టైం పీహెచ్డీ, పోస్ట్ డాక్టోరల్ ప్రవేశాలు వేరుగా జరుగుతాయి. వాటి ఇంటర్వ్యూ జాబితాను వర్సిటీ అక్టోబరు 27న విడుదల చేసింది.
More Stories
Jobs & Educationమిలిటరీ కళాశాల ప్రవేశ పరీక్ష.. నగర స్లిప్పులు విడుదల
Jobs & Educationటీజీపీఎస్సీ ఏఈఈ ప్రాథమిక కీ విడుదల.. 17 వరకు అభ్యంతరాలు
Jobs & Educationతెలంగాణ టెట్‌కు 16 నుంచి దరఖాస్తులు.. జనవరిలో పరీక్ష
Jobs & Educationటీజీపీఎస్సీ డీఈవో పరీక్ష.. తొలిరోజు 11,448 మంది హాజరు
Jobs & Educationగ్రామీణ బ్యాంకు ఆఫీసర్ కాల్ లెటర్లు విడుదల.. తెలుగు రాష్ట్రాల్లో 560 పోస్టులు
Jobs & Educationరవాణా శాఖలో 50 ఏఎంవీఐ పోస్టులు.. 26 వరకు దరఖాస్తు
