Original bilingual journalism · English & తెలుగు
టెస్టులకు శాంట్నర్ దూరం.. ఫాక్స్క్రాఫ్ట్కు పిలుపు
భారత్‌తో రెండు టెస్టులకు న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ దూరమయ్యాడు. ఐదో వన్డేలో అతడి కుడి చేతి ఎముక విరిగింది. అతడి స్థానంలో డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ జట్టులోకి వచ్చాడు.

భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ రెండు టెస్టులకూ దూరమయ్యాడు. అతడి కుడి చేతి ఎముక విరిగినట్లు స్కానింగ్‌లో తేలింది. అతడి స్థానంలో సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ స్పిన్ ఆల్‌రౌండర్ డీన్ ఫాక్స్క్రాఫ్ట్ను జట్టులోకి తీసుకున్నారు. న్యూజిలాండ్ క్రికెట్ ఈ మేరకు మంగళవారం (నవంబరు 17) ప్రకటించింది.
తొలి టెస్టు నవంబరు 19 గురువారం వెల్లింగ్టన్లోని బేసిన్ రిజర్వ్‌లో మొదలవుతుంది. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఆట ఆరంభమవుతుందని బీసీసీఐ షెడ్యూలు చెబుతోంది.
పది ఓవర్లు.. ఆపై గాయం
మౌంట్ మాంగనూయ్‌లోని బే ఓవల్‌లో ఆదివారం (నవంబరు 15) ఐదో వన్డే జరిగింది. ఆ మ్యాచ్‌లో కివీస్‌కు శాంట్నర్ సారథ్యం వహించాడు. టాస్ గెలిచి భారత్‌కు బ్యాటింగ్ అప్పగించాడు. 10 ఓవర్లలో 47 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. నమన్ ధీర్, ఆకిబ్ నబీ, అరంగేట్ర బౌలర్ యశ్ ఠాకూర్ అతడికే చిక్కారు.
ఛేదనలో బ్యాటింగ్ చేస్తుండగా అతడి చేతికి దెబ్బ తగిలింది. 31 బంతుల్లో 2 సిక్సర్లతో 24 పరుగులు చేశాడు. 41వ ఓవర్లో జట్టు స్కోరు 158 వద్ద ఏడో వికెట్‌గా వెనుదిరిగాడు. ధీర్ బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చాడు. కివీస్ 187 పరుగులకు ఆలౌటైంది. భారత్ 22 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 3-1తో సొంతం చేసుకుంది.
శాంట్నర్ కోలుకునేందుకు ఎంత సమయం పడుతుందో అంచనా వేస్తున్నామని బోర్డు తెలిపింది. ఆస్ట్రేలియాలో జరిగే టెస్టు సిరీస్‌కు అతడు అందుబాటులో ఉంటాడా అన్నది తర్వాత చెబుతామని పేర్కొంది.
ఫాక్స్‌క్రాఫ్ట్ కూడా ఆ వన్డే ఆడాడు. 42 బంతుల్లో 31 పరుగులు చేసి ఠాకూర్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. రోహిత్ శర్మ క్యాచ్ పట్టిందీ అతడే. మే నెలలో ఐర్లాండ్‌పై అతడు టెస్టు అరంగేట్రం చేశాడు.
ముగ్గురిపై ఇంకా స్పష్టత లేదు
టామ్ లేథమ్ సారథ్యంలోని 14 మంది జట్టును బుధవారం (నవంబరు 11) ప్రకటించారు. అప్పటికే టామ్ బ్లండెల్ (తొడ కండరం), డెవాన్ కాన్వే (కంకషన్), రచిన్ రవీంద్ర (భుజం) గాయాలతో ఉన్నారు. తొలి టెస్టుకు కోలుకోవాలని చూస్తున్నారు. తాజా ప్రకటనలో ఈ ముగ్గురి గురించి ఏమీ చెప్పలేదు.
భారత జట్టుకు శుభ్‌మన్ గిల్ సారథి. 16 మంది జట్టులో తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్, ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఉన్నారు. రెండో టెస్టు క్రైస్ట్‌చర్చ్‌లోని హేగ్లీ ఓవల్‌లో నవంబరు 27 శుక్రవారం మొదలవుతుంది.
More Stories
Sportsవైశాలి చేతిలో ఓటమి.. సెమీస్‌కు అర్జున్ ఇరిగేశి దూరం
Sportsశాఫ్ ఫైనల్లో పాక్‌తో భారత్ ఢీ.. హ్యాట్రిక్‌పై గురి
Sportsముస్తాక్ అలీ ట్రోఫీ.. అజేయ విదర్భతో హైదరాబాద్ ఢీ
Sportsముస్తాక్ అలీ ట్రోఫీ.. ఆఖరి బంతికి హైదరాబాద్ గెలుపు
Sports2029లో ఛాంపియన్స్ ట్రోఫీ.. 2031లో ప్రపంచకప్ భారత్‌లోనే
Sportsఐసీసీ ఛైర్మన్‌గా జై షా మళ్లీ ఏకగ్రీవం
