Original bilingual journalism · English & తెలుగు
ముస్తాక్ అలీ ట్రోఫీ.. ఆఖరి బంతికి హైదరాబాద్ గెలుపు
ఆఖరి బంతికి రక్షణ్ రెడ్డి తీసిన పరుగుతో ఛత్తీస్‌గఢ్‌పై హైదరాబాద్ ఒక వికెట్ తేడాతో గెలిచింది. అజయ్‌దేవ్ గౌడ్ 28 పరుగులకు 4 వికెట్లు తీశాడు.

చివరి బంతి.. స్కోర్లు సమం.. క్రీజులో ఆఖరి జోడీ. ఈ దశలో సౌరభ్ మజుందార్ బౌలింగ్‌లో రక్షణ్ రెడ్డి తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఒక పరుగు తీశాడు. దీంతో ముస్తాక్ అలీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-డి మ్యాచ్‌లో ఛత్తీస్‌గఢ్‌పై హైదరాబాద్ ఒక వికెట్ తేడాతో గెలిచింది. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో సోమవారం (నవంబరు 16) ఈ మ్యాచ్ జరిగింది. బీసీసీఐ స్కోరు కార్డు ప్రకారం 169 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్లకు అందుకుంది.
నవంబరు 14న ముంబయి చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడిన హైదరాబాద్‌కు ఇదే తొలి విజయం. 11 రోజుల ముందు కూడా ఈ రెండు జట్ల పోరు ఇలాగే ముగిసింది. నవంబరు 5న జింఖానా మైదానంలో జరిగిన రంజీ మ్యాచ్‌లో జయంత్ యాదవ్ బౌలింగ్‌లో రక్షణ్ సిక్సర్ బాది హైదరాబాద్‌కు ఒక వికెట్ విజయం అందించాడు.
అజయ్‌దేవ్ గౌడ్‌కు 4 వికెట్లు
టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ చామ మిలింద్ బౌలింగ్ ఎంచుకున్నాడు. మ్యాచ్ తొలి బంతికే ఛత్తీస్‌గఢ్ కెప్టెన్ వికల్ప్ తివారీని రిటర్న్ క్యాచ్‌తో వెనక్కి పంపాడు. 22 పరుగులకే 3 వికెట్లు పడిన దశలో ఆయుష్ పాండే (37; 28 బంతుల్లో), దేవ్ ఆదిత్య సింగ్ (47; 29 బంతుల్లో, 3 సిక్సర్లు) జట్టును ఆదుకున్నారు. నాలుగో వికెట్‌కు 60 పరుగులు జోడించారు.
అజయ్‌దేవ్ గౌడ్ 4 ఓవర్లలో 28 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. 168/7తో ఉన్న ఛత్తీస్‌గఢ్ మరో పరుగు చేయకుండానే చివరి 3 వికెట్లు కోల్పోయింది. 19.2 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది. మిలింద్ 20 పరుగులకు 3, రక్షణ్ 34 పరుగులకు 2 వికెట్లు పడగొట్టారు.
107/2 నుంచి 129/7కు
ఛేదనలో అభిరథ్ రెడ్డి (34), కొడిమెల హిమతేజ (37; 22 బంతుల్లో) మూడో వికెట్‌కు 62 పరుగులు జోడించారు. 11వ ఓవర్‌లో స్కోరు 107/2. తర్వాతి 6 బంతుల్లోనే 3 వికెట్లు పడ్డాయి. స్కోరు 109/5కి చేరింది. అభిరథ్‌ను అజయ్ మండల్ ఎల్బీగా ఔట్ చేశాడు. జయంత్ యాదవ్ వరుస బంతుల్లో హిమతేజ, భవేశ్ సేఠ్‌లను వెనక్కి పంపాడు. 15వ ఓవర్‌లో విజయ్ యాదవ్ 2 వికెట్లు తీయడంతో హైదరాబాద్ 129/7తో కష్టాల్లో పడింది.
రాహుల్ బుద్ధి (28), తనయ్ త్యాగరాజన్ (19; 11 బంతుల్లో) ఎనిమిదో వికెట్‌కు 27 పరుగులు జోడించారు. 19వ ఓవర్‌లో జట్టు స్కోరు 156 వద్ద బుద్ధి ఔటయ్యాడు. ఆఖరి ఓవర్ ఐదో బంతికి త్యాగరాజన్ వెనుదిరిగాడు. అప్పటికి స్కోరు 168. మిగిలిన ఒక్క బంతికి రక్షణ్ విజయ పరుగు తీశాడు.
హైదరాబాద్ తదుపరి మ్యాచ్‌లో బుధవారం (నవంబరు 18) ఉదయం 11 గంటలకు ఈడెన్ గార్డెన్స్‌లోనే విదర్భతో తలపడనుంది. ఆడిన 2 మ్యాచ్‌ల్లోనూ విదర్భ గెలిచింది. గ్రూప్-డిలో ముంబయి, విదర్భ చెరో 2 విజయాలతో ముందున్నాయి. హైదరాబాద్, ఛత్తీస్‌గఢ్ 2 మ్యాచ్‌ల్లో ఒక్కో విజయం సాధించాయి.
More Stories
Sportsనలుగురు పేసర్లతో భారత్.. న్యూజిలాండ్‌తో తొలి టెస్టు
Sportsముస్తాక్ అలీ ట్రోఫీ.. కేరళపై ఆంధ్ర గెలుపు.. హైదరాబాద్‌కు ఓటమి
Sportsవానలోనూ కుర్రాళ్ల జోరు.. ఆసియా కప్ దిశగా భారత్
Sportsఐపీఎల్ ఆటకు ధోనీ వీడ్కోలు.. ఇక చెన్నై మెంటార్
Sportsపాక్‌పై భారత్ గెలుపు.. శాఫ్ టైటిల్ హ్యాట్రిక్
Sportsవైశాలి చేతిలో ఓటమి.. సెమీస్‌కు అర్జున్ ఇరిగేశి దూరం
