Original bilingual journalism · English & తెలుగు
ప్రపంచ షూటింగ్లో ఇషా సింగ్ బృందానికి స్వర్ణం.. వ్యక్తిగత ఫైనల్లో నిరాశ
దోహా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్ విభాగంలో భారత్ 1761 పాయింట్లతో స్వర్ణం గెలిచింది. వ్యక్తిగత ఫైనల్లో మను నాలుగో, ఇషా ఎనిమిదో స్థానంలో నిలిచారు.

దోహాలో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ (ISSF) ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్ విభాగంలో భారత్ స్వర్ణం గెలిచింది. నవంబరు 10 మంగళవారం హైదరాబాద్ షూటర్ ఇషా సింగ్, మను బాకర్, దివ్య సుబ్బరాజు కలిసి 1761 పాయింట్లు సాధించారు. దక్షిణ కొరియా (1748) రజతం, వియత్నాం (1745) కాంస్యం దక్కించుకున్నాయి.
భారత జట్టులో ఇషానే అత్యధికంగా 590 పాయింట్లు సాధించింది. ప్రెసిషన్ దశలో 292, ర్యాపిడ్ ఫైర్ దశలో 298 స్కోర్ చేసింది. ర్యాపిడ్‌లో రెండు సిరీస్‌ల్లో వందకు వంద కొట్టింది. దీంతో క్వాలిఫికేషన్లో మూడో స్థానంలో నిలిచింది. మను 587 (289, 298) పాయింట్లతో ఆరో స్థానంతో ఫైనల్ చేరగా, దివ్య 584 పాయింట్లు జోడించింది.
అదే రోజు జరిగిన వ్యక్తిగత ఫైనల్లో మాత్రం భారత్‌కు పతకం దక్కలేదు. మను 27 హిట్లతో నాలుగో స్థానంలో నిలిచి, త్రుటిలో పతకం చేజార్చుకుంది. ఎనిమిది మంది ఫైనలిస్టుల్లో ఇషా ముందుగా నిష్క్రమించింది. 11 హిట్లతో ఎనిమిదో స్థానానికి పరిమితమైంది.
దక్షిణ కొరియా షూటర్ యాంగ్ జీన్ 44 హిట్లతో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పి స్వర్ణం గెలిచింది. వియత్నాం షూటర్ ట్రిన్ థు విన్ 43 హిట్లతో రజతం, చైనా షూటర్ జాంగ్ యుయుయె 34 హిట్లతో కాంస్యం సాధించారు. ఈ ముగ్గురూ తమ దేశాలకు లాస్ ఏంజెలెస్ 2028 ఒలింపిక్ కోటా స్థానాలు కూడా అందించారు. ఈ విభాగంలో భారత్‌కు ఇంకా కోటా దక్కలేదు.
దోహాలో ఈ ఛాంపియన్షిప్ నవంబరు 14 వరకు జరుగుతుంది.
More Stories
Sportsవర్షార్పణం: హామిల్టన్ మూడో వన్డే ఒక్క బంతి పడకుండానే రద్దు.. భారత్ 2-0 ఆధిక్యం పదిలం
Sportsమూడో వన్డే: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. తర్వాత మళ్లీ వర్షం
Sportsతెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్.. డిసెంబరు 11 నుంచి
Sportsప్రపంచ షూటింగ్: తొలి దశలో ఈషా సింగ్‌కు ఐదో స్థానం
Sportsఅర్జున్ శతకం వృథా.. పాకిస్థాన్ చేతిలో భారత్‌కు తొలి ఓటమి
SportsChennai Open: doubles finalలో అడ్కర్-భోసలే runners-up; 6-2, 6-0తో గెలిచిన స్విస్ జోడీ కరామోకో-వాల్టర్ట్
