Original bilingual journalism · English & తెలుగు
బీటెక్ తర్వాత భారత సైన్యంలో ఆఫీసర్ కావడం ఎలా? ప్రవేశ మార్గాలు, ఎస్‌ఎస్‌బీ, నాలుగేళ్ల సన్నద్ధత
బీటెక్ చదివినవారు సైన్యంలో ఆఫీసర్ కావడానికి టీజీసీ, ఎస్‌ఎస్‌సీ (టెక్నికల్) రెండు మార్గాలు. విడిగా రాతపరీక్ష లేదు. అర్హత, ఐదు రోజుల ఎస్‌ఎస్‌బీ, వైద్య పరీక్ష, శిక్షణ, నాలుగేళ్ల సన్నద్ధత ఇక్కడ.

రచయిత: Dr. Yogesh Misra
బీటెక్ చదివినవారికి కార్పొరేట్, టెక్నాలజీ ఉద్యోగాలే కాదు, భారత సైన్యంలో కమిషన్డ్ ఆఫీసర్ అయ్యే అవకాశం కూడా ఉంది. సాంకేతిక జ్ఞానం, నాయకత్వం, క్రమశిక్షణ, సమస్యలు పరిష్కరించే నైపుణ్యం వాడే రంగం ఇది.
రెండు ముఖ్యమైన మార్గాలు
- టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (టీజీసీ): అవివాహిత పురుషులకు. పర్మనెంట్ కమిషన్ లభిస్తుంది.
- షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్నికల్): పురుషులు, మహిళలు దరఖాస్తు చేయవచ్చు. షార్ట్ సర్వీస్ కమిషన్ లభిస్తుంది.
ఈ రెండింటికీ విడిగా రాతపరీక్ష ఉండదు. ఇంజినీరింగ్ మార్కులు, నోటిఫికేషన్‌లోని కటాఫ్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అర్హత, ఖాళీలు, సర్వీసు షరతులు ప్రతి ఎంట్రీకి వేరుగా ఉండవచ్చు.
అర్హత, దరఖాస్తు
బీఈ / బీటెక్ చదివినవారు, చివరి సంవత్సరం విద్యార్థులు (నోటిఫికేషన్‌లో చెప్పిన తేదీలోగా పాస్ అయిన రుజువు ఇవ్వాలి) దరఖాస్తు చేయవచ్చు. వయసు సాధారణంగా 20 నుంచి 27 ఏళ్లు. బ్రాంచ్, వయసు లెక్కించే తేదీ, మార్కుల కటాఫ్, వైద్య ప్రమాణాలను ఆ కోర్సు నోటిఫికేషన్‌లో చూడాలి. దరఖాస్తు అధికారిక వెబ్‌సైట్ joinindianarmy.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో చేయాలి.
ఐదు రోజుల ఎస్‌ఎస్‌బీ
షార్ట్‌లిస్ట్ అయినవారిని సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూకు పిలుస్తారు.
- మొదటి రోజు (స్టేజ్ 1): ఓఐఆర్ (తార్కిక సామర్థ్యం పరీక్ష), పీపీడీటీ. ఇందులో ఒక చిత్రాన్ని కాసేపు చూపుతారు; దానిపై కథ రాసి, చెప్పి, గ్రూప్ చర్చలో పాల్గొనాలి. స్టేజ్ 1 దాటినవారే ముందుకు వెళ్తారు.
- సైకాలజీ పరీక్షలు: టీఏటీ (చిత్రాలపై కథలు), డబ్ల్యూఏటీ (పదాలపై వాక్యాలు), ఎస్‌ఆర్‌టీ (నిజ జీవిత పరిస్థితుల్లో ఏం చేస్తారు), సెల్ఫ్ డిస్క్రిప్షన్.
- గ్రూప్ టెస్టింగ్ (జీటీఓ): గ్రూప్ చర్చ, గ్రూప్ ప్లానింగ్, లెక్చరెట్, అబ్‌స్టకిల్స్, కమాండ్ టాస్క్ వంటివి. సహకారం, ఆచరణాత్మక ఆలోచన, నాయకత్వం చూస్తారు.
- పర్సనల్ ఇంటర్వ్యూ: చదువు, ఆసక్తులు, క్రీడలు, కుటుంబం, స్నేహితులు, సాధారణ పరిజ్ఞానం.
- ఐదో రోజు (కాన్ఫరెన్స్): మొత్తం ప్రదర్శన చూసి ‘రికమెండెడ్’ లేదా ‘నాట్ రికమెండెడ్’ అని చెబుతారు.
వైద్య పరీక్ష, శిక్షణ
రికమెండ్ అయినవారికి వైద్య పరీక్ష ఉంటుంది. ఫిట్‌గా ఉన్నవారికి ఖాళీలను బట్టి తుది మెరిట్ జాబితా తయారవుతుంది. ఎంపికైనవారు శిక్షణ తర్వాత ఆఫీసర్‌గా కమిషన్ పొందుతారు. ఎస్‌ఎస్‌సీ (టెక్) శిక్షణ ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీలో సుమారు 49 వారాలు; టీజీసీ శిక్షణ దెహ్రాదూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఉంటుంది. తాజా వ్యవధిని నోటిఫికేషన్‌లో చూడండి.
నాలుగేళ్ల సన్నద్ధత (రచయిత సూచన)
- మొదటి సంవత్సరం: చదువులో మంచి మార్కులు (సీజీపీఏ 8 పైన లక్ష్యంగా), మాట్లాడే నైపుణ్యం, రోజూ వ్యాయామం.
- రెండో సంవత్సరం: క్లబ్‌లు, క్రీడలు, నాయకత్వ కార్యక్రమాలు.
- మూడో సంవత్సరం: ఎస్‌ఎస్‌బీ విధానం తెలుసుకోండి, వార్తలు అనుసరించండి, ఫిట్‌నెస్ కొనసాగించండి.
- నాలుగో సంవత్సరం: నోటిఫికేషన్లు గమనించి దరఖాస్తు చేయండి, ఎస్‌ఎస్‌బీకి సిద్ధం కండి, పత్రాలు సిద్ధంగా ఉంచుకోండి.
సైన్యంలో ఆఫీసర్ ఉద్యోగానికి నిబద్ధత, నిజాయతీ, క్రమశిక్షణ, బాధ్యత తీసుకునే మనసు కావాలి. ముందుగానే మార్గాలు తెలుసుకుని, డిగ్రీ మొత్తం క్రమం తప్పకుండా సిద్ధమవ్వాలి. తాజా నోటిఫికేషన్లు, ఎంపిక నిబంధనలకు అధికారిక వెబ్‌సైటే ప్రమాణం.
రచయిత గురించి

Dr. Yogesh Misra ఆంధ్రప్రదేశ్‌లోని రాజాంలో ఉన్న GMRIT డీమ్డ్ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్. ఇదే సబ్జెక్టులో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ చేశారు. బోధన, పరిశ్రమ అనుభవంతో పాటు విద్యార్థుల మెంటరింగ్, కెరీర్ మార్గదర్శనంలో పని చేస్తున్నారు. IEEE సీనియర్ మెంబర్, ISTE లైఫ్ మెంబర్.
More Stories
Jobs & Educationరాజ్యాంగ దినోత్సవ క్విజ్ 2026.. 500 మందికి నగదు బహుమతులు, నవంబరు 26 వరకు అవకాశం
Jobs & Educationడిసెంబరు 4 నుంచి జేఎన్టీయూహెచ్ పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష
Jobs & Educationమిలిటరీ కళాశాల ప్రవేశ పరీక్ష.. నగర స్లిప్పులు విడుదల
Jobs & Educationటీజీపీఎస్సీ ఏఈఈ ప్రాథమిక కీ విడుదల.. 17 వరకు అభ్యంతరాలు
Jobs & Educationతెలంగాణ టెట్‌కు 16 నుంచి దరఖాస్తులు.. జనవరిలో పరీక్ష
Jobs & Educationటీజీపీఎస్సీ డీఈవో పరీక్ష.. తొలిరోజు 11,448 మంది హాజరు
