Original bilingual journalism · English & తెలుగు
ఎస్‌ఎస్‌సీ ఎస్సై పరీక్ష.. 21 వేల మంది మెమో ఇవ్వాలి
దిల్లీ పోలీస్, కేంద్ర సాయుధ బలగాల ఎస్సై పరీక్ష-2026 రాయనున్న సుమారు 21 వేల మంది పదో తరగతి వివరాల్లో తేడాలున్నాయని ఎస్‌ఎస్‌సీ గుర్తించింది. వారు నవంబరు 20లోగా మార్కుల జాబితా సమర్పించాలి.

దిల్లీ: దిల్లీ పోలీస్, కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సీఏపీఎఫ్) ఎస్సై పరీక్ష-2026 రాయనున్న సుమారు 21,000 మంది అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) కీలక సూచన చేసింది. వీరంతా శుక్రవారం (నవంబరు 20)లోగా పదో తరగతి మార్కుల జాబితా ప్రతిని ఆన్‌లైన్‌లో సమర్పించాలి. ఈ పరీక్ష పేపర్-1 నవంబరు 23 నుంచి మొదలవుతుంది.
ఈ అభ్యర్థుల పదో తరగతి వివరాల్లో తేడాలు కనిపించాయని ఎస్‌ఎస్‌సీ నవంబరు 13న విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. వారిని తాత్కాలికంగా పరీక్షకు అనుమతిస్తోంది. అయితే ఫలితాల సమయంలో చిక్కులు రాకూడదంటే పత్రం ఇవ్వాల్సిందేనని పేర్కొంది. అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ వెబ్‌సైట్ https://ssc.gov.inలో తమ పోర్టల్‌లోకి లాగిన్ కావాలి. ఎస్సై-2026 పరీక్షకు సంబంధించిన ‘‘సిటీ లైవ్ / అడ్మిట్ కార్డ్ స్టేటస్’’ పేజీలో మార్కుల జాబితాను అప్‌లోడ్ చేయాలి. కమిషన్ ప్రాంతీయ కార్యాలయాలు వీరిని ఈ–మెయిల్ ద్వారానూ సంప్రదిస్తున్నాయి.
ముందు పరీక్ష నగరం.. తర్వాత హాల్‌టికెట్
పేపర్-1 నవంబరు 23 నుంచి 28 వరకు జరుగుతుంది. ఏ నగరంలో పరీక్ష రాయాలో అభ్యర్థులు లాగిన్ అయి ఇప్పటికే చూసుకోవచ్చు. హాల్‌టికెట్లు మాత్రం ఒక్కొక్కరి పరీక్ష తేదీకి రెండు, మూడు రోజుల ముందు అందుబాటులోకి వస్తాయని కమిషన్ తెలిపింది. ఇతర నియామక పరీక్షల తేదీలను తెలుగు స్కోప్ ఉద్యోగాల క్యాలెండర్‌లో చూడొచ్చు.
అదే రోజు 2025 బ్యాచ్‌కు పేపర్-2
కొత్త పరీక్ష చివరి రోజైన నవంబరు 28నే 2025 ఎస్సై పరీక్ష పేపర్-2 కూడా జరగనుంది. ఈ మేరకు ఎస్‌ఎస్‌సీ నవంబరు 2న షెడ్యూలు ప్రకటించింది. జులై 21 నుంచి 30 వరకు బలగాలు నిర్వహించిన దేహదారుఢ్య, శరీర కొలతల పరీక్షల్లో నెగ్గినవారు ఇది రాస్తారు. కోర్టు కేసుల కారణంగా తాత్కాలిక అనుమతి పొందినవారూ రాయొచ్చు.
ఈ పరీక్ష పేపర్-1 ఫలితాలు మార్చి 30న వెలువడ్డాయి. అందులో 48,387 మంది అర్హత సాధించారు. అక్టోబరు 29న ప్రకటించిన శారీరక పరీక్షల ఫలితాల ప్రకారం వీరిలో 10,676 మంది నెగ్గారు. 26,949 మంది హాజరుకాలేదు. 10,622 మంది విఫలమయ్యారు. మరో 136 మంది ఫలితాలను నోడల్ బలగమైన సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) సిఫార్సు మేరకు నిలిపివేశారు. నలుగురిని తాత్కాలికంగా అన్‌ఫిట్‌గా తేల్చారు.
బీఎస్‌ఎఫ్ ఇచ్చిన సమాచారంతో ఎస్‌ఎస్‌సీ నవంబరు 16న ఈ ఫలితాల్లో తాజాగా సవరణ చేసింది. న్యాయస్థానాల్లో కేసులున్న మరో ముగ్గురికి పేపర్-2 రాసే అవకాశం ఇచ్చింది. కేసుతో సంబంధం లేని ఒక రోల్ నంబరును జాబితా నుంచి తొలగించింది. మరో నంబరును సరిదిద్దింది. అక్టోబరు 29 నాటి ప్రకటనలో కేసుల కారణంగా 97 మందికి తాత్కాలిక అనుమతి ఇచ్చారు. తెలుగు స్కోప్ లెక్క ప్రకారం తాజా మార్పులతో ఆ సంఖ్య 99కి చేరుతుంది. వీరి తుది ఫలితం కేసుల తీర్పుపైనే ఆధారపడి ఉంటుంది. పేపర్-2 హాల్‌టికెట్లను కమిషన్ ప్రాంతీయ కార్యాలయాలు జారీ చేస్తాయి.
More Stories
Nationalఏపీలో పెరిగిన మలేరియా.. 2025 మొత్తాన్ని మించిన కేసులు
Nationalడీజిల్ ఎగుమతులపై సుంకం పెంపు.. లీటరుకు రూ.14
Nationalనాలుగు రాష్ట్రాల్లో జనగణన.. ఏపీ, తెలంగాణలో జనవరి 10 నుంచి
Nationalయూపీఎస్సీలో 13 పోస్టులు.. డిసెంబరు 4 వరకు దరఖాస్తు
Nationalఅక్టోబరులో నిరుద్యోగ రేటు 4.9%.. మహిళల్లో మెరుగుదల
Nationalవైద్య ఖర్చులో సగానికి పైగా ఏపీ ప్రజల జేబు నుంచే
