Original bilingual journalism · English & తెలుగు
వాహన వయసు, బీఎస్ ప్రమాణాన్ని బట్టి పీయూసీ సర్టిఫికెట్ గడువు.. కేంద్ర ప్రతిపాదన
కొత్త ప్రైవేటు బీఎస్-6 వాహనానికి పీయూసీ సర్టిఫికెట్ మూడేళ్లు చెల్లుబాటయ్యేలా, పదేళ్లు దాటిన వాహనాలకు ఆరు నెలలే ఉండేలా రోడ్డు రవాణా శాఖ ప్రతిపాదించింది.

దిల్లీ: కాలుష్య నియంత్రణ (పీయూసీ) సర్టిఫికెట్ల చెల్లుబాటు కాలాన్ని వాహనం వయసు, ఉద్గార ప్రమాణం (బీఎస్) ఆధారంగా మార్చాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ ప్రతిపాదించింది. ఇందుకోసం కేంద్ర మోటారు వాహన నిబంధనల్లోని 115వ నిబంధన ఉప నిబంధన (7)ను సవరించనున్నట్లు గురువారం (నవంబరు 19) తెలిపింది.
ప్రతిపాదిత గడువులు
బీఎస్-6 ప్రైవేటు (రవాణేతర) వాహనాలకు తొలిసారి నమోదైనప్పటి నుంచి ఆరేళ్ల వరకు పీయూసీ మూడేళ్లు, ఆరు నుంచి పదేళ్ల వరకు ఏడాది, పదేళ్లు దాటాక ఆరు నెలలు చెల్లుబాటవుతుంది. బీఎస్-6 రవాణా వాహనాలకు ఇదే వయసు వర్గాల్లో రెండేళ్లు, ఏడాది, ఆరు నెలలు ఉంటుంది. బీఎస్-1, బీఎస్-2, బీఎస్-3 వాహనాలకు మూడు నెలలు, బీఎస్-4 వాహనాలకు ఆరు నెలలు గడువు ప్రతిపాదించారు.
పునరుద్ధరణలో మార్పులు
ఇప్పటికే జారీ అయిన సర్టిఫికెట్లకు కొత్త గడువు, సవరణ అమల్లోకి వచ్చాక వాటిని తొలిసారి పునరుద్ధరించినప్పటి నుంచే వర్తిస్తుంది. ప్రస్తుత సర్టిఫికెట్ గడువు ముగిసేలోపు 10 రోజుల్లో పునరుద్ధరిస్తే, కొత్త సర్టిఫికెట్ ప్రస్తుతం ఉన్నది ముగిసిన తేదీ నుంచే లెక్కిస్తారు. గడువు ముగిశాక పునరుద్ధరిస్తే, పునరుద్ధరించిన తేదీ నుంచి చెల్లుబాటవుతుంది.
వాహనం వయసును బట్టి ఉద్గార పరీక్షల తరచుదనాన్ని నిర్ణయించడం, కొత్త, తక్కువ కాలుష్యం వెదజల్లే వాహనాల యజమానులపై భారం తగ్గించడం, సర్టిఫికేషన్ వ్యవస్థను మరింత ప్రభావవంతం చేయడం, ఉద్గారాలపై నిరంతర నిఘా ఉంచడం ఈ మార్పుల లక్ష్యమని శాఖ తెలిపింది. ఇవన్నీ ప్రతిపాదనలేనని ప్రకటనలో పేర్కొంది.
More Stories
Lifestyleయాంటీబయాటిక్స్‌కు లొంగని ప్రతి మూడో ఇన్ఫెక్షన్
Lifestyleతెలంగాణ పురుషుల్లో 21.1%, ఏపీలో 18.8% మందికి పొగాకు అలవాటు
Lifestyleఐఐటీఎఫ్ ఆరోగ్య పెవిలియన్‌లో క్షయ పరీక్షలు.. సీపీఆర్ ప్రదర్శనలు
Lifestyleవృద్ధుల సంరక్షణకు ‘శతాయు’.. 30,151 మంది సహాయకులు
Lifestyleప్రపంచ మధుమేహ దినం.. తెలుగు రాష్ట్రాల్లో చక్కెర పైపైకి
Lifestyleక్షయ మరణాలు 38% తగ్గాయి.. దాదాపు పావువంతు కేసులు భారత్‌లోనే
