Original bilingual journalism · English & తెలుగు
అర్నబ్ ప్రభావం: ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు; మరో నాలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్
అక్టోబర్ 28 ఉదయం 8.30 నుంచి 24 గంటల పాటు తూర్పు తెలంగాణలోని నాలుగు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 70 కి.మీ. వరకు ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. అక్టోబర్ 31 నుంచి పొడి వాతావరణం.

తీవ్ర తుపాను ‘అర్నబ్’ అక్టోబర్ 28న ఆంధ్రప్రదేశ్ తీరం దాటనుంది. దీని ప్రభావం తెలంగాణపైనా గట్టిగానే ఉండనుంది. అక్టోబర్ 28 ఉదయం 8.30 నుంచి 24 గంటల్లో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అక్టోబర్ 27 రాత్రి 8.30కు విడుదల చేసిన బులెటిన్‌లో తెలిపింది. ఈ నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఈ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడొచ్చు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయి.
గంటకు 70 కి.మీ. వరకు గాలులు
భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 50–60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. కొన్నిసార్లు ఈ వేగం 70 కి.మీ. వరకు చేరొచ్చు. మిగతా జిల్లాల్లో గాలి వేగం 30–40 కి.మీ. ఉంటుంది.
భారీ వర్షం పడే చోట్ల రోడ్లపై నీరు నిలవడం, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, ట్రాఫిక్ నిలిచిపోవడం, చెట్లు, కరెంటు స్తంభాలు కూలడం వంటి ఇబ్బందులు రావచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. చెట్ల కింద తలదాచుకోవద్దని, పక్కా భవనాల్లోనే ఉండాలని సూచించింది. తుపాను ప్రభావిత జిల్లాల్లో కరెంటు సరఫరాకు అంతరాయం తగ్గించేలా అప్రమత్తంగా ఉండాలని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్‌లో ఎలా ఉంటుంది
అక్టోబర్ 28న హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, గంటకు 30–40 కి.మీ. ఈదురుగాలులు ఉంటాయి. నగరంలోని అన్ని జోన్లలో ప్రభావం చాలా తక్కువేనని వాతావరణ కేంద్రం పేర్కొంది. అక్టోబర్ 29, 30 తేదీల్లో వర్షాలు కొన్ని చోట్లకే పరిమితమవుతాయి. అక్టోబర్ 31 నుంచి రాష్ట్రమంతా పొడి వాతావరణం ఉంటుందని అంచనా.
More Stories
Telanganaజీడిమెట్ల స్మార్ట్ మీటర్ల పైలట్: 8,331 మీటర్లు పనిచేస్తున్నాయి, నవంబర్‌లో వినియోగదారులకు యాప్
Telanganaఖమ్మం జిల్లా చింతకాని వద్ద పత్తి కూలీల ట్రాక్టర్ బోల్తా: 22 మందికి గాయాలు, ఆరుగురికి ఫ్రాక్చర్లు
Telanganaటన్నుకు 10 కిలోలు తక్కువ: నల్గొండ జిల్లా శాలిగౌరారంలో మూడు కాటాలు సీజ్, ధాన్యం కొనుగోలుదారులపై కేసులు
Telanganaతెలంగాణ హైకోర్టు కొత్త చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ తపబ్రత చక్రవర్తి: నలుగురు సీజేలను సిఫార్సు చేసిన కొలీజియం
Telanganaఎస్ఎస్సీ జేఈతో క్లాష్: ఆ అభ్యర్థులకు టీజీపీఎస్సీ ఏఈఈ పరీక్ష నవంబర్ 7కు మార్పు, అక్టోబర్ 30 లోపు హాల్ టికెట్ ఇవ్వాలి
Telanganaహైదరాబాద్‌లో నీటి అత్యవసర పరిస్థితి: మూడు రోజులకోసారి సరఫరా, రోజుకు 8,000 ట్యాంకర్ బుకింగ్‌లు, వృథా చేస్తే రూ.1,000 జరిమానా